Saturday, December 17, 2011

మల్లెమాల


మాట కరుకు.. మనసు సున్నితం.. ఈ వాక్యం అచ్చంగా సరిపోయే వ్యక్తిత్వం మల్లెమాల సుందరరామరెడ్డిది. ఇంత పెద్ద పేరు తెలియకున్నా.. ఎంఎస్ రెడ్డి అన్నా, మల్లెమాల అన్నా సినీ అభిమానులందరికీ సుపరిచితమే. ఆయన మనసులాగే భావాలు కూడా సున్నితం. అచ్చమైన పల్లెటూరు అమాయకత్వం, భోళాతనం ఆయనలో తొంగిచూసేది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే ఆయనకు చాతనైనది. మాటల్లో అచ్చమైన నెల్లూరు నుడికారం పలకరిస్తుంది. పాటలు, మాటల్లో మాత్రం లలితమైన పదాలు వాడేవారు. ‘తెల్లావారక ముందే పల్లె లేచింది..తనవారినందరినీ తట్టిలేపింది..పాడు చీకటికెంత భయమేసిందో పక్క దులుపుకుని ఒకే పరుగుతీసింది’- అంటూ ‘మంచుపల్లకి’ సినిమా పాటలో రాసిన వాక్యాలు చాలు ఆయన భావాలు ఎంత హాయిగా, సున్నితంగా వుంటాయో అర్థం చేసుకునేందుకు. మంచి సినిమాలు, మంచి పాటలు, మంచి మాటలకు ఆయన కేరాఫ్ అడ్రస్. లాభనష్టాలు తరువాత. నిజానికి మంచి సినిమాలే కానీ పెద్ద ‘హిట్’ చిత్రాలు తీసింది లేదని ఆయనే స్వయంగా అంగీకరించేవారు. తన కుమారుడు శ్యాంసుందరరెడ్డి నిర్మాత అయ్యాకే తమ సంస్థకు సరైన హిట్‌లు వచ్చాయని మొహమాటం లేకుండా చెప్పేవారు. ఆయన తన సినిమాలన్నింటిలో ‘ఏకలవ్య’ను ఎక్కువగా ఇష్టపడేవారు. అక్కడ కూడా ఏకలవ్యుడి అమాయకత్వం, గురువు అంటే అభిమానం వంటి లక్షణాలు ఆయనను ఆకట్టుకోవడమే అందుకు కారణం.
‘ఆత్మకథ’ కలకలం
ముక్కుసూటితనంతో ఉండడమే ఆయన జీవిత చరమాంకంలో కొన్ని వివాదాలకు గురిచేసింది. ‘ఇదీ నా కథ’ పేరిట నిర్మొహమాటంగా ఆయన రాసిన ఆత్మకథ తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనాలు సృష్టించింది. కేవలం కొద్ది కాపీలను మాత్రం ఆయన స్వయంగా తన సన్నిహితులకు అందేలా చేసారు. పుస్తకం నిండా పలువురు సినీ ప్రముఖులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు వుండడమే ఇందుకు కారణం. బయటకు వచ్చిన కాపీల ఆధారంగా వివిధ మాధ్యమాల ద్వారా పుస్తకంలోని విషయాలు జనానికి చేరాయే తప్ప, పుస్తకాలు మాత్రం బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి లేకుండా పోయాయి. అలా ఓ నిర్మొహమాటి రాసిన ఆత్మకథ దాదాపు చీకటి కొట్లోనే ఉండిపోయింది.
ఎవరినీ వదల్లేదు.
నిర్మాతగా మల్లెమాల ఎనె్నన్నో ఆటుపోట్లను చవిచూశారు. అలుపెరుగని పోరాటం చేశారు. వృత్తిపరంగా ముళ్లబాటలు ఎదురైనా తాను నమ్ముకున్న రంగాన్ని మాత్రం వదులుకోలేదు. సినిమా ప్రపంచమంటే భారీగా సంపాదన, విలాసవంతమైన జీవితం కాదని, నిర్మాతకూ ఎన్నో కష్టాలుంటాయని ఆయన తన ఆత్మకథలో పలు విషయాలను నిస్సంకోచంగా ప్రస్తావించారు. నటీనటుల నుంచి దర్శకుల వరకూ అందరూ ఏదోరకంగా నిర్మాతను పీడించేవారన్నది ఆయన ఆవేదన సారాంశం. సినీ రంగంలో ఎంతటి ప్రముఖులైనా వారి వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు పడ్డానోనన్న విషయాలను ఆయన కుండ బద్దలు కొట్టినట్లు ‘ఇదీ నా కథ’లో బహిర్గతం చేశారు. ఎన్టీఆర్, శోభన్‌బాబు, చిరంజీవి, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు గుణశేఖర్.. ఇలా ఎవరినీ ఆయన వదిలిపెట్టలేదు.
ఆత్మకథ సంగతి పక్కనపెడితే, మనిషిగా మల్లెమాల చిత్రపరిశ్రమలో మంచి పేరే సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ,శోభన్‌బాబు, చిరంజీవి లాంటి అగ్రహీరోలందరితో సినిమాలు నిర్మించారు. అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు సమానంగా నిర్మించారు. అన్ని పాత్రల్లో పిల్లలనే నటింపచేస్తూ రామాయణం నిర్మించారు. దాదాపు ఇటు వంటి ప్రయత్నం ప్రపంచ సినీ చరిత్రలోనే మొదటిది. ఈ చిత్రంతోనే జూనియర్ ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసారు. ఎందరో నటులను, సాంకేతిక నిపుణులను సినిమా రంగానికి పరిచయం చేయడంలో ఆయన చొరవచూపారు. తన సినిమా పాటలన్నింటిలో సంగీత సాహిత్యాలకు పెద్దపీట వుండేలా చూసేవారు. తన నిర్మాణ సంస్థకు కౌముది అని తన రికార్డింగ్ థియేటర్‌కు శబ్దా లయ అని పేర్లు పెట్టడం మల్లెమాల అభిరుచిని తెలియచేస్తాయి. ఎమ్మెస్‌రెడ్డి పలుసార్లు తన సినిమాలకు సంబంధించి నంది అవార్డులు అందుకున్నారు.