Monday, June 21, 2010

సుందరం.. సమ్మోహనం.. ఎం.ఎస్.రామారావు గానం




మోపర్తి సీతారామారావు అంటే ఎవరో చాలామందికి వెంటనే స్ఫురించకపోవచ్చును. కాని ఎం.ఎస్.రామారావు అనగానే తెలుగు సినిమాల తొలి నేపథ్య గాయకుడుగా సంగీతాభిమానులందరకూ పాత తరం ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులు. ఇంకా వివరంగా వ్రాయాలంటే ‘సుందరదాసు’ అనగానే ఆయన యావత్ ఆంధ్రదేశానికీ ప్రసిద్ధులు. ఆయన రచించి, సంగీతం సమకూర్చి గానం చేసిన ‘సుందరకాండ’ గీతాలు యావదాంధ్ర దేశంలోనూ మారుమ్రోగాయి. మారుమ్రోగుతున్నాయి. ఇంకా మారు మ్రోగుతూనే ఉంటాయి. శ్రీమద్ రామాయణంలోని మధురమైన ‘సుందరకాండ’ కథను, తేట తెలుగులో, మృదు మధురమైన శైలిలో ఆయన పాడిన తీరు అపూర్వం, అద్వితీయం. ఈ విధంగా త్రిపాత్రాభినయం చేసిన వారు (రచన, సంగీతం, గానం) ఆయనకు ముందు మరొక గాయకులు లేరనడం అతిశయోక్తి కాదు.
‘సుందరదాసు’ బిరుదాంకితులైన ఎం.ఎస్.రామారావుగారు 3-7-1921 తేదీన గుంటూరు జిల్లా తెనాలి సమీపానగల ‘మోపర్రు’ గ్రామంలో జన్మించారు. ఊరిపేరే ఇంటిపేరుకూడా అయ్యింది. 1941వ సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గాయకుడిగా స్థిరపడాలనే ఆశతో, మదరాసు వెళ్లారు. అప్పుడు తెలుగు చిత్రాలు తీయటంలో వాహినీ సంస్థ అగ్రగామిగా ఉండేది. వాహినీ సంస్థవారి ఆస్థాన కథా రచయిత సముద్రాల రాఘవాచార్య గారి సహకారంవల్ల, 1942 సంవత్సరంలో బి.ఎన్.రెడ్డిగారి నిర్మాణ, దర్శకత్వంలో వెలువడిన వాహినీ వారి ‘దేవత’ చిత్రంలో మొట్టమొదటిసారిగా ఒక నేపథ్య గీతం పాడారు. ‘‘ఈ వసంతమూ నిత్యము కాదోయ్’’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ (నేపథ్య గీతం) పాడి, తెలుగు చలనచిత్ర తొలి నేపథ్య గాయకుడుగా ప్రసిద్ధి కెక్కారు. ఆ తరువాత ‘చెంచులక్ష్మీ’ (1943), ‘తహసీల్దార్’ (1944) మొదలైన చిత్రాలలో ఆ చిత్ర కథా నాయకుడూ, నాటి ప్రముఖ హీరో అయిన సిహెచ్. నారాయణరావు గారికి ప్లేబాక్ పాటలు పాడారు. ‘తహసీల్దార్’ చిత్రంతో పడవ నడిపేవాడుగా, తానే ఆ పాత్ర ధరించి పాడిన పాట (నండూరి సుబ్బారావు గారు రచించిన ‘ఎంకిపాట’) ‘ఈ రేయి నన్నోల నేరవా రాజా’ అన్న పాట ఎం.ఎస్. రామారావు గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. లోగడ ఎం.ఎస్.రామారావు గారి గురించి చాలామంది వ్రాసిన వ్యాసాలలో ‘ఈ రేయినన్నోల్ల’ అన్నదే వారి మొట్టమొదటిపాట అని వ్రాశారు. కాని అది పొరపాటు. ‘దేవత’ (1942)లోని ‘ఈ వసంతమూ నిత్యము కాదోయ్’ అన్నదే వారి తొలిపాట. ఆ తరువాత రామారావుగారు ఎన్నో యుగళ గీతాలూ, విషాద గీతాలు పాడారు. అప్పటి ప్రముఖ హీరో సిహెచ్.నారాయణరావు గారు నటించిన అన్ని చిత్రాలలో నారాయణరావుగాకి, ఎంఎస్ రామారావుగారే తన వాయిస్ ఇచ్చి పాడారు. ‘తసీల్దార్’, ‘చెంచులక్ష్మీ’, ‘మనదేశం’, ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’, ‘మొదటిరాత్రి’, ‘మానవతి’ వంటి అనేక చిత్రాలలో నారాయణరావు గారికి రామారావు గారు పాడిన పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. ‘మనదేశం’లో కథానాయిక కృష్ణవేణి గారితో కలిసి, రామారావుగారు నారాయణరావు గారికి పాడిన యుగళగీతం ‘ఏమిటీ ఈ సంబంధం - ఎందుకో ఈ అనుబంధం’ తెలుగు సినిమా యుగళ గీతాలలో, మొదట్టమొదటి 10 స్థానాలలో నిలిచే యుగళగీతాలలో ఒకటి అని ప్రఖ్యాత సినీ సంగీత విశే్లషకులు వి.ఎ.కె.రంగారావుగారు పేర్కొన్నారు. ఇది అక్షరాల నిజం.
ఇవిగాక విషాద గీతాలూ, నేపథ్య గీతాలూ ఆలపించటంలో ఎం.ఎస్.గారు బహుదిట్ట. ‘పోరా బాబూ పో’ (దీక్ష), ‘శోకపు తుపాను చెలరేగిందా’ (పిచ్చిపుల్లయ్య), ‘జీవిత మింతేరా మానవ జీవితమింతేరా’ (జయసింహ), ‘బ్రతుకిదేనా సంఘమునా’ (పరదేశి), ‘కనీసం ప్రతి మనిషికీ కూడు గుడ్డ నీదైనా ఉండాలా (మేరికం) వంటి పాటలు, ఆయన పాడిన పాటలతో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. క్రమేపీ తెలుగు చలనచిత్ర సంగీతంలో వచ్చిన మార్పుల వలనా, హీరోగా సిహెచ్.నారాయణరావు వెనుకబడటంవలనా, గాయకుడుగా ఘంటసాల గారు అప్రతిహతంగా ఎదగడంవలనా, ఎంఎస్ రామారావు గారికి అవకాశాలు సన్నగిల్లాయి. అయినప్పటికీ ఎంఎస్‌గారిని అభిమానించే ఎన్.టి. రామారావుగారు, తను నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో కొన్ని అపురూపమైన శ్లోకాలు పాడించారు. ఆ రామారావుగారు (ఎన్.టి.), ఈ రామారావుగారిని (ఎంఎస్) ప్రత్యేకంగా పిలిపించుకుని ‘సీతారామ కల్యాణం’ చిత్రంలో కొన్ని మధురమైన శ్లోకాలు, పరశురాముడు పాత్రధారి శర్మగారికి ఒక దండకం పాడించారు. ఇవన్నీ చిరస్మరణీయాలే. ఆ తరువాత ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (1975) చిత్రంలో అంగదుని పాత్రధారికి ఒక చక్కని మధురమైన శ్రీరామస్తోత్రం పాడారు.
సినిమాలలో అవకాశాలు తగ్గిన తరువాత ఆయన దృష్టి ఆధ్యాత్మికతవైపు మళ్లింది. మదరాసు నుండి రాజమండ్రి వెళ్లి అక్కడ ఒక గురుకుల పాఠశాల స్థాపించి ఆంజనేయస్వామి వారి మీద అచంచల భక్తితో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ వచ్చారు.
ఆ సమయంలోనే సాక్షాత్తూ ఆంజనేయస్వామి వారే వీరికి కలలో సాక్షాత్కరించి ‘సుందరకాండ’ను గానం చేయమని ఆదేశించినట్టు చెబుతారు. ఈ విధంగా ‘హనుమత్ సాక్షాత్కారం’ పొందిన మహానుభావులు ఎం.ఎస్.రామారావు గారు. శ్రీరాముని ఆదేశంతో బమ్మెరపోతన ఏ విధంగా భాగవతమును ఆంధ్రీకరించారో, అలాగే హనుమతుని ఆదేశంతో, ఆయన నాయకుడైన సుందరకాండను, తేట తెలుగులో రచించి, సంగీతం అందించి తన మృదుమధుర కంఠస్వరంతో గానం చేశారు. ‘శ్రీ హనుమాను గురుదేవులు నాయెడ పలికిన సీతారామ కథా, నే పలికెద సీతారామ కథా’ అనే మకుటంతో వీరు పాడిన ‘సందరకాండ’ అశేష తెలుగు ప్రజానీకానికి ఒక పెన్నిధి వంటిది. ఇప్పటివరకూ అనేకసార్లు రేడియోలోనూ, టీవీలలోనూ, ఆంధ్ర దేశమంతటా మారు మ్రోగింది. ప్రతీ తెలుగువాడి ఇంట్లోనూ ఎప్పుడో ఒకప్పుడు, వినిపిస్తూనే వుంటుంది. అంతేగాక తులసీదాసుగారి హనుమాన్ చాలీసానుకూడా తేట తెలుగులో అనువదించి గానం చేశారు. ఈ రెండూ తెలుగువారికి తరిగిపోని నిధి నిక్షేపాలు.
ఈ మహానుభావుని ప్రతిభను గుర్తించి, తెలుగు గానాభిమానులు 7-4-1977 తేదీన వీరికి ఘనసన్మానం చేసి ‘సుందర దాసు’ అని బిరుదును ప్రదానం చేశారు.
ఈ మధుర గాయక భక్త శిఖామణులు 20-4-1992 తేదీన హైదరాబాద్‌లో పరమ పదించారు. ఎం.ఎస్.రామారావుగారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చును. రామారావు, ఘంటసాల వంటి అమరగాయకులకు మరణం లేదు. వీరు పాడిన సినిమా పాటలూ, ముఖ్యంగా సుందరకాండ తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆంజనేయస్వామి వారు చిరంజీవులు. అలాగే ఎం.ఎస్.రామారావుగారి పాటలూ, వారి సుందరకాండ కూడా చిరంజీవులే.

ఆయన గానం చేసిన హనుమాన్ చాలీసా ఈ కింద వినండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: